27, జులై 2017, గురువారం

నితీష్ ,చంద్రబాబుల రాజకీయ సారూప్యత

బీహార్లో అనూహ్య పరిణామాల కారణంగా నితీష్ కుమార్ లాలూతో తెగతెంపులు చేసుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 24 గంటల లోపలే తన పాత మిత్రపక్షమైన భాజపా తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో నితీష్ కుమార్ కు రాజకీయంగా కొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి మద్య సారూప్యత ఉన్న కొన్ని అంశాలు పరిశీలిందాం.

ఒకప్పుడు......

              నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్ల సందర్బముగా నితీష్ , బాబు ఇద్దరు మోడీని వ్యతిరేకించినవారే.

            ఇద్దరూ మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన వారే.

           నితీష్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న బీహార్ కు దేశము లో గుర్తింపు తీసుకు రావడానికి నితీష్ ఎంతో కృషి చేసారు.

        అలాగే బాబు కూడా దక్షిణాది అంటే చెన్నయ్, బెంగళూరు మాత్రమే కాదు, హైదరాబాదు కూడా అనేలా హైదరాబాదుకు జాతీయ , అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి ఎంతో కృషి చేసారు.

          వాజపేయి, అద్వానీ ల హయాంలో ఇద్దరూ ప్రముఖ పాత్ర పోషించడమే కాక, ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నవారే.
          తదనంతర కాలంలో ఇద్దరూ భాజపా తో తెగతెంపులు చేసుకున్నవారే.

ఇప్పుడు.....

        మారిన రాజకీయ పరిస్థితులలో ఇద్దరూ కోరి మరీ భాజపా తో స్నేహం చేస్తున్నవారే.

         మోడీతో పెద్దగా సఖ్యత లేకపోయిన తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోడీతో స్నేహం చేస్తున్నవారే.

        భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తే వీళ్లిద్దరూ జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగిన ప్రధానమంత్రి అభ్యర్థులే.