27, జులై 2017, గురువారం

నితీష్ ,చంద్రబాబుల రాజకీయ సారూప్యత

బీహార్లో అనూహ్య పరిణామాల కారణంగా నితీష్ కుమార్ లాలూతో తెగతెంపులు చేసుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 24 గంటల లోపలే తన పాత మిత్రపక్షమైన భాజపా తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో నితీష్ కుమార్ కు రాజకీయంగా కొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి మద్య సారూప్యత ఉన్న కొన్ని అంశాలు పరిశీలిందాం.

ఒకప్పుడు......

              నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్ల సందర్బముగా నితీష్ , బాబు ఇద్దరు మోడీని వ్యతిరేకించినవారే.

            ఇద్దరూ మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన వారే.

           నితీష్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న బీహార్ కు దేశము లో గుర్తింపు తీసుకు రావడానికి నితీష్ ఎంతో కృషి చేసారు.

        అలాగే బాబు కూడా దక్షిణాది అంటే చెన్నయ్, బెంగళూరు మాత్రమే కాదు, హైదరాబాదు కూడా అనేలా హైదరాబాదుకు జాతీయ , అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి ఎంతో కృషి చేసారు.

          వాజపేయి, అద్వానీ ల హయాంలో ఇద్దరూ ప్రముఖ పాత్ర పోషించడమే కాక, ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నవారే.
          తదనంతర కాలంలో ఇద్దరూ భాజపా తో తెగతెంపులు చేసుకున్నవారే.

ఇప్పుడు.....

        మారిన రాజకీయ పరిస్థితులలో ఇద్దరూ కోరి మరీ భాజపా తో స్నేహం చేస్తున్నవారే.

         మోడీతో పెద్దగా సఖ్యత లేకపోయిన తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోడీతో స్నేహం చేస్తున్నవారే.

        భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తే వీళ్లిద్దరూ జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగిన ప్రధానమంత్రి అభ్యర్థులే.

2, అక్టోబర్ 2015, శుక్రవారం

స్వచ్చ భారత్ ఏడాది పూర్తి

స్వచ్చ భారత్ భారత జాతిపిత మహాత్మాగాంధీ స్పూర్తితో, మన ప్రధాని నరేంద్రమోదీ గత సంవత్సరం గాంధీ జయంతి రోజున ప్రారంభించిన మహోద్యమం.నేటికి ఒక సంవత్సరం పూర్తైన వేళ ప్రధాని ఆశలు, ఆకాంక్షలు, స్వచ్చభారత్ విజయాలు, అపజయాలు ఎన్నింటినో తనలో ఇముడ్చుకుంది.నరేంద్రమోదీ స్వచ్చభారత్ పిలుపు ఇచ్చిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు, గ్రామాలలో సైతం ప్రజలు స్వచ్చందంగా మరియు యావత్ భారతావని దానిని మహోద్యమంగా తీసుకోవడం నరేంద్రమోదీ ఆకర్షణ శక్తికి నిదర్శనం.పురాతన, ఆధ్యాత్మిక,చారిత్రక నేపధ్యమున్న భారత దేశం ఎక్కడ చూసిన చెత్తా,చెదారంతో 'మురికి భారతావని ' గా తయారయ్యింది.మన దేశం ఈ దుస్థితి నుంచి బయట పడాలనే మహా సంకల్పంతో, ప్రజలను కూడా భాగస్వాములని చేస్తూ నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమమే స్వచ్చభారత్.


           స్వచ్చభారత్ పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరిలోను దేశానికి సేవ చెయ్యలనే సంకల్పం కలగజేసింది.ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శుభ్రతను ఒక కార్యక్రమంగా చేసుకుని తమతమ పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నాయి.మైసూరు నగరం పరిశుభ్రతలో జాతీయస్థాయిలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.ఈ విజయం వెనుక మైసూరు మహానగర పాలకమండలి కృషితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, నగర పాలక సిబ్బంది, సఫాయి కార్మికుడుగా జీవితాన్ని ప్రారంభించి మైసూరు నగర మేయరుగా ఉన్న నారయణ శ్రమ దాగి ఉన్నాయి. తెలంగాణ,రాయలసీమ,కోస్తా ప్రాంతాలతో కూడిన పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రమదానం అనే కార్యక్రమం ప్రారంభించారు. 

        స్వచ్చభారత్ కొన్ని విజయాలతో పాటు, ఎన్నో అపజయాలు కూడా మూటకట్టుకుంది.స్వచ్చభారత్ ప్రముఖులతో పాటు, సామన్య ప్రజలు సైతం చీపురు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమంగా తయారయ్యింది.దేశంలో ఏటా 12.5 లక్షలు ఈ-వ్యర్ధాలు తయారవుతున్నయని ఒక అంచనా.ప్రభుత్వాలు ఈ వ్యర్ధాల నుంచి పునర్వినియోగ ఉత్పత్తుల తయారీని చేపట్టాలి.వ్యర్ధాలతో నడిచే కంపోస్టు,విద్యుత్తు తయారీ కేంద్రాలని ఏర్పాటు చెయ్యాలి. ఇంటింటా చెత్త సేకరించి తడి,పొడి చెత్తను వేరుచేసి,తడి చెత్తతో బయోగ్యాస్,వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాలని,పొడి చెత్తతో ప్లాస్టిక్, కాగితం తయారీ కేంద్రాలని ఏర్పాటు చెయ్యాలి.